న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం వరుసగా ఐదో రోజు శనివారం కూడా కొనసాగింది. ఇండిగోకు చెందిన వందలాది విమానాలు శనివారం కూడా రద్దు కాగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రద్దు, ఆలస్యం కారణంగా వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాలలో పడిగాపులు పడుతూ అనేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇతర విమానయాన సంస్థలు టికెట్ల రేట్లను విపరీతంగా పెంచేయడంతో ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.
పైలట్ల కొరత కారణంగా సంక్షోభం ఏర్పడినట్లు ఇండిగో చెబుతున్నప్పటికీ ప్రభుత్వం తాత్కాలిక ఊరట కల్పించినా పరిస్థితి అదుపులోకి రావడానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. శనివారం దేశవ్యాప్తంగా ఇండిగోకు చెందిన 850 విమానాలను రద్దు అయ్యాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో పాటు మరో నాలుగు విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. డిసెంబర్ 7వ తేదీ(ఆదివారం) రాత్రి 8 గంటల లోపల ప్రయాణికులకు టికెట్ల డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ శనివారం ఇండిగోను ఆదేశించింది. టికెట్ల ధరలపై పరిమితిని విధిస్తున్నట్లు కేంద్రం మరో ప్రకటనలో వెల్లడించింది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 37 ప్రధాన రైళ్లలో 116 అదనపు బోగీలను ప్రవేశపెట్టినట్లు భారతీయ రైల్వేలు ప్రకటించాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఇండిగోకు చెందిన 106 విమానాలు రద్దు కావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇండిగో నిర్వహణా సామర్థ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఎయిర్‌పోర్టు అథారిటీ చెబుతున్నప్పటికీ విమానాలు ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రీ బుకింగ్ చేసుకునేందుకు ప్రయాణికులు విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడింది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న కారణంగా విమానాలు నడపడం ఇండిగోకు కష్టతరంగా మారింది. చెన్నై విమానాశ్రయం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. మెట్రో రూట్లలో ఇతర ఎయిర్‌లైన్స్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పుణెలో 42 విమానాలు రద్దు కాగా, అహ్మదాబాద్‌లో 19, తిరువనంతపురంలో 3 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇండియన్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఏవియేషన్ ప్రెసిడెంట్ నితిన్ జాదవ్ మాట్లాడుతూ, ఈ సంక్షోభానికి బాధ్యత ఇండిగో యాజమాన్యానిదేనని ఆరోపించారు. పైలట్ల బాధ్యత లేదని చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మద్దతు యాజమాన్యానికే ఉందన్నారు. డీజీసీఏ, ఇండిగోలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ సంక్షోభ సమయంలో ప్రయాణికుల హక్కులను పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు సమన్వయంతో పని చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. విమానయాన సంస్థ లు, విమానాశ్రయాలు, భద్రతా సంస్థలు, ఇతర కార్యనిర్వాహక వ్యవస్థలతో సమన్వయంతో పని చేస్తున్నట్లు వివరించింది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర ప్రయాణాలు చేయవలసినవారికి సరైన సదుపాయాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త చెప్పాయి. ప్రస్తుత పరిస్థితులలో ప్రయాణికుల సౌకర్యార్థం ‘ఎకానమీ క్లాస్’ ధరలకు పరిమితి విధిస్తున్నామని, ‘డిమాండ్-సరఫరా మెకానిజం’ను వర్తింపజేస్తూ చార్జీల పెంపుదలను పక్కకు పెడుతున్నామని శనివారం తెలిపాయి. అంతేగాకుండా ప్రయాణికులను, వారి సామాగ్రిని గమ్యస్థానాన్ని చేర్చేందుకుగాను తమ పనితీరు పెంచుతున్నట్టు ప్రకటించాయి.
పైలట్ల విశ్రాంతి పని గంటలపై కేంద్రం ప్రవేశపెట్టిన నూతన నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన ఇండిగో సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దడంతో పూర్తిగా వైఫల్యం చెందిన ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కేంద్రం ఒత్తిడి తేనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఆ సంస్థపై భారీ జరిమానా కూడా విధించాలని నిర్ణయించింది. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు.
విమాన ప్రయాణ చార్జీలపై పరిమితులను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా, అతి తక్కువగా స్పందించిందని విమర్శలు వస్తున్నాయి. ఇండిగో సంక్షోభం ఈ నెల 15 వరకు కొనసాగవచ్చునని తెలుస్తున్నది. నాలుగైదు రోజుల క్రితం నుంచి ఈ నెల 15 వరకు ఇండిగో విమానాల్లో ప్రయాణించేందుకు టికెట్లను బుక్ చేసుకున్నవారు వాటిని రద్దు చేసుకుంటున్నారు. వేరే విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించేందుకు టికెట్లను అత్యధిక ధరలకు కొంటున్నారు. ఇటువంటివారికి శనివారం నుంచి అమల్లోకి వచ్చిన టికెట్ ఛార్జీలపై పరిమితుల వల్ల ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్న తలెత్తుతున్నది.
విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల లగేజీని వారి నివాసం లేదా వారు ఎంపిక చేసుకున్న చిరునామాకు 48 గంటల్లోగా అందజేయాలని శనివారం ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. టికెట్ చార్జీలను ఆదివారం రాత్రి 8 గంటలలోగా చెల్లించాలని ఆదేశించింది. సేవల్లో ఘోర వైఫల్యంపై దర్యాప్తు ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 24 గంటల్లోగా ఈ విషయమై వివరణ ఇవ్వాలని కేంద్రం ఇండిగో సీఈవోకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ప్రయాణికులు రద్దు చేసుకున్న టికెట్లకు తాము చెల్లించవలసిన సొమ్మును ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకున్నపుడు ఉపయోగించిన చెల్లింపు పద్ధతిలోనే ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుందని ఇండిగో శనివారం ఎక్స్‌లో ఒక ప్రకటన చేసింది.
ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలను పెంచుతుండటంపై కేంద్రం స్పందించింది. విమాన చార్జీలపై పరిమితులను విధించింది.
దూరం గరిష్ఠ చార్జీ (రూ.)
500 కి.మీ. వరకు 7,500
500-1,000 కి.మీ. 12,000
1,000-1,500 కి.మీ. 15,000
1,500 కి.మీ.కిపైగా 18,000
పీఎస్ఎఫ్, పన్నులు రావని తెలిపింది. ఈ పరిమితులు బిజినెస్ క్లాస్, ఆర్సీఎస్ ఉడాన్ విమానాలకు వర్తించవని వివరించింది. అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా వివిధ ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు ఇవి వర్తిస్తాయని తెలిపింది.