న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులపై శాఖాపరమైన చర్యలకు సంబంధించి 82 కేసులు పెండింగ్లో ఉన్నాయి. (Pending Cases On CBI officers ) దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ ప్రతిష్టను ఈ కేసులు ప్రతిబింబిస్తున్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విమర్శించింది. సీబీఐ అధికారులపై నమోదైన కేసులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. 2023 డిసెంబర్ 31 నాటికి సీబీఐ అధికారులపై శాఖాపరమైన చర్యలకు సంబంధించి 82 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సీబీఐలోని గ్రూప్ ఏ అధికారులపై 54 డిపార్ట్మెంటల్ కేసులు నమోదయ్యాయి. అలాగే గ్రూప్ బీ, సీ అధికారులపై 28 కేసులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని సీవీసీ వార్షిక నివేదిక పేర్కొంది.
కాగా, సీబీఐలోని గ్రూప్ ఏ అధికారులపై పెండింగ్లో ఉన్న మొత్తం డిపార్ట్మెంటల్ యాక్షన్ కేసుల్లో 25 కేసులు నాలుగు సంవత్సరాలకుపైగా పెండింగ్లో ఉన్నాయి. మూడు నుంచి నాలుగేళ్ల మధ్య పెండింగ్లో 4 కేసులు, ఏడాది నుంచి మూడేళ్ల మధ్య పెండింగ్లో 16 కేసులు, ఏడాది కన్నా తక్కువగా పెండింగ్లో 9 కేసులున్నట్లు సీవీసీ తెలిపింది. 51 కేసుల్లో దర్యాప్తు పురోగతి వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొంది. తుది ఉత్తర్వుల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) వద్ద మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడించింది.
మరోవైపు సీబీఐలోని గ్రూప్ బీ, సీ అధికారులపై డిపార్ట్మెంటల్ యాక్షన్ కేసుల పెండింగ్ వివరాలను కూడా సీవీసీ బయటపెట్టింది. నాలుగేళ్లకుపైగా పెండింగ్లో ఏడు కేసులు, మూడేళ్ల నుంచి నాలుగేళ్లు పెండింగ్లో రెండు, రెండేళ్ల నుంచి మూడేళ్లు పెండింగ్లో ఒక కేసు, ఏడాది నుంచి రెండేళ్లు పెండింగ్లో నాలుగు కేసులు, ఏడాది కంటే తక్కువగా 16 కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది.