ములుగు,/ఘట్కేసర్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధి లంకపల్లి అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల వరకు విస్తరించి ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతం కాల్పులతో మోతమోగింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. ఇం దులో మావోయిస్టు పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ బండి ప్రకాశ్ ఉన్నట్టు తెలిసింది. 18 రోజులుగా కర్రెగుట్టల వద్ద కొనసాగుతున్న కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 34కు చేరుకున్నట్టు ప్ర చారం. ఎన్‌కౌంటర్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ములుగు జిల్లా వాజేడు-వెంకటాపురం(నూగూరు) మండలాల సరిహద్దుల్లోని పేరూరు అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మావోయిస్టుల జాడ కోసం కర్రెగుట్టల్లో చేపడుతున్న కూంబింగ్‌లో పాల్గొన్న తెలంగాణ గ్రేహౌండ్స్‌కు చెందిన శ్రీధర్, సందీప్, పవణ్‌కల్యాణ్ అనే ముగ్గురు జవాన్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతిచెందినట్టు తెలిసింది. వీరితోపాటు వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్‌కి తీవ్రగాయాలు కాగా హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలించినట్టు సమాచారం. పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు ల్యాండ్‌మైన్స్ పేల్చినట్టు తెలుస్తున్నది. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.
ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా, గురువారం ఉదయం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్‌నగర్‌కు చెందిన తిక్క అశోక్, శోభ దంపతుల కుమారుడు సందీప్ తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ మేరకు అధికారులు సమాచారం ఇవ్వడంతో తల్లి, బంధువులు ఘటనా స్థలానికి వెళ్లారు. సందీప్ మృతిచెందిన వార్త తెలియడంతో ఘట్కేసర్ పట్టణంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సందీప్ చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని తపన పడేవాడని, కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించాడని స్థానికులు చెప్తున్నారు. మావోయిస్టుల మందుపాతరకు బలవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా, తల్లి శోభ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది. మూడేండ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగిని పావనిని వివాహం చేసుకున్నాడు.