న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ ప్రాంత మహిళలు పది మందిలో ఎనిమిది మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అదే సమయంలో అధిక శాతం మంది మహిళలు ఆన్లైన్ వేధింపులు, మోసాలు, తిట్లు, ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఈ విషయం లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్వే వివరాలను ఆ సంస్థ ప్రకటించింది. తమ ఫిర్యాదులపై 24 గంటల్లో స్పందించేందుకు మహిళా సైబర్ గ్రీవెన్స్ హాట్‌లైన్‌ను ప్రారంభించాలని 46 శాతం మంది అభిప్రాయపపడ్డారు.
జాతీయ హాట్‌లైన్‌ను స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని 60 శాతం మంది తెలిపారు. బంధువులు, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం కోసం 76 శాతం, సమాచార సేకరణ కోసం 57 శాతం, సినిమాలు, సంగీతం, వినోదం కోసం 57 శాతం, ఆన్లైన్ షాపింగ్ కోసం 46 శాతం, సేవల బుకింగ్ కోసం 35 శాతం, సోషల్ మీడియా కోసం 19 శాతం, బిల్లుల చెల్లింపుల కోసం 14 శాతం, తమ వ్యాపారం కోసం 5 శాతం, ఇతర అవసరాల కోసం 14 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.