న్యూఢిల్లీ: ఖతార్‌లో పనిచేస్తున్న భారతీయ నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ ఉద్యోగులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి వాళ్లు దోహా జైలులో ఉన్నారు. ఆ 8 మందిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మరణశిక్ష(Death Penalty)ను కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసును మే 3వ తేదీన మళ్లీ విచారించనున్నారు.
గూఢచర్యం కేసులో ఆ 8 మందిని ప్రస్తుతం జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్‌కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు చెబుతున్నారు.
దహ్రా గ్లోబల్ కంపెనీ నిర్మించనున్న సబ్‌మెరైన్ కోసం భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులను భారీ సంఖ్యలో నియమించుకున్నారు. కానీ ఆ ఉద్యోగుల్లో 8 మంది.. ఖతార్ అధికారులతో కలిసి ఇజ్రాయిల్‌పై నిఘాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దోహా జైలులో ఉన్న నౌకాదళ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిది అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్ నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాలా, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్‌లు ఉన్నారు.