Maharashtra | ముంబై: బీజేపీ నేతృత్వంలోని మహాయుతి పాలిత మహారాష్ట్రలో రైతన్నల బలవన్మరణాలను మంత్రి మకరంద్ జాదవ్ పాటిల్ అంగీకరించారు. రాష్ట్రంలో 56 నెలల్లో రోజుకు సగటున 8 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్త పాక్షికంగా వాస్తవమని తెలిపారు. శాసన మండలిలో ఎన్సీపీ ఎమ్మెల్సీ శివాజీ రావు ప్రశ్నకు సహాయ, పునరావాస శాఖ మంత్రి మకరంద్ సమాధానం చెప్తూ, ఛత్రపతి శంభాజీ నగర్, అమరావతి డివిజన్లలో రైతుల ఆత్మహత్యలు మిగిలిన ప్రాంతాల్లో కన్నా ఎక్కువ అని తెలిపారు.
మరాఠ్వాడా డివిజన్లో 952 మంది, అకోలాలో 168 మంది, వారాలలో 112 మంది, బీడ్లో 205 మంది, అమరావతి డివిజన్లో 1,069 మంది రైతులు నిరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్ డివిజన్లో 707 మంది ఆర్థిక సాయం పొందేందుకు అర్హులని చెప్పారు.