న్యూఢిల్లీ: ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులు గత కొన్ని నెలలుగా ఖతార్‌లో నిర్బంధంలో ఉన్నారు. అయితే భారత అధికారులు దౌత్య మార్గం ద్వారా వారిని రెండోసారి కలిశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఒమన్ మాజీ వైమానిక దళ అధికారికి చెందిన ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ నౌకాదళ అధికారులు పని చేస్తున్నారు. అయితే ఆగస్ట్ 30న ఖతార్ అధికారులు వీరిని నిర్భంధించారు. భారత నేవీలో ఉన్నత ర్యాంకుల్లో పదవీ విరమణ చేసిన వీరిని ఎందుకు అరెస్ట్ చేశారో అన్నది తెలియలేదు.
మరోవైపు ఖతార్‌లో నాలుగు నెలలుగా నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులను రెండవ కాన్సులర్ యాక్సెస్ ద్వారా గురువారం కలిసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వారాంతపు మీడియా సమావేశంలో తెలిపారు. ఖతార్‌లోని భారత రాయబార అధికారులు వారిని కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. దోహాలోని వారి కుటుంబ సభ్యులు కూడా నిర్బంధంలో ఉన్న కొందరిని కలిసినట్లు తెలిపారు. భారత మాజీ నేవీ అధికారులను విడిపించేందుకు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని వెల్లడించారు.