(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఆస్తులు వంశపారంపర్యంగా పిల్లలకు దక్కడం సహజం. అయితే అదే రీతిలో కొన్ని రకాల ప్రమాదకరమైన వ్యాధులు కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తున్నాయి.దీనికి చెక్ పెట్టడంలో బ్రిటన్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కీలక పురోగతి సాధించారు. తాజా పరిశోధన భవిష్యత్తు వైద్య చరిత్రలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారమని వైద్య నిపుణులు తెలిపారు.
బీపీ, షుగర్, కండరాల నొప్పులు, అవయవ లోపం, ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, కొన్ని రకాల క్యాన్సర్లు తదితర జబ్బులు పేరెంట్స్ నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే ప్రమాదం ఉన్నది. దీంతో తర్వాతి తరాలు వంశపారంపర్య వ్యాధులబారిన పడకూడదన్న ఉద్దేశంతో బ్రిటన్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి సంయుక్తంగా సరికొత్త ఐవీఎఫ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు. దీని కోసం ముగ్గురు వ్యక్తుల నుంచి డీఎన్ఏను సేకరించారు. ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా వెలువడ్డాయని ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ఓ కథనం ప్రచురితమైంది.
కణాల కేంద్రకంలో డీఎన్ఏ ఉంటుంది. తల్లి, తండ్రి నుంచే ఈ డీఎన్ఏ శిశువుకు సంక్రమిస్తుంది. అయితే, కణంలో కేంద్రకం అవతల మైటోకాండ్రియాలో కూడా కొంత డీఎన్ఏ ఉంటుంది. ఇది పరివర్తనం చెందినట్లయితే, పుట్టే శిశువుల్లో వంశపారంపర్య వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. దీంతో పరిశోధకులు తల్లి, తండ్రి నుంచి డీఎన్ఏతో పాటు మూడో వ్యక్తి నుంచి కూడా డీఎన్ఏను (పరివర్తనం చెందనటువంటి ఆరోగ్యకరమైన మైటోకాండ్రియాలోని డీఎన్ఏ) సేకరించి ఐవీఎఫ్ పద్ధతిలో అండాన్ని, శుక్రకణంతో ఫలదీకరించారు.
ఈ ప్రయోగంలో వంశపారంపర్య ఆరోగ్య సమస్యలు ఉన్న 22 మంది మహిళలు పాల్గొనగా, అంతిమ ఫలితాల్లో ఎనిమిది మంది మహిళలకు శిశువులు జన్మించారు. వీరిలో ఆరుగురు శిశువుల్లో వంశపారంపర్య వ్యాధులకు కారణమయ్యే పరివర్తన మైటోకాండ్రియా ప్రభావం 95-100 శాతం మేర తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. మిగతా ఇద్దరిలో ఇది 77-88 శాతం వరకూ ఉన్నట్టు పేర్కొన్నారు. పరివర్తన మైటోకాండ్రియా ప్రభావాన్ని 40 శాతం మేర తగ్గిస్తే వంశపారంపర్య జబ్బులకు చెక్ పెట్టవచ్చని, ప్రస్తుత ప్రయోగంలో ఇది 77 శాతం నుంచి 100 శాతం వరకూ ఉండటంతో ఈ ప్రయోగం పూర్తిగా సక్సెస్ సాధించినట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు.