అయోధ్య : అయోధ్య రామాలయ(Ayodhya Ram Temple) నిధుల చోరీ కేసులో 8 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ నిందితుల్లో లవ్ కుశ్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అత్యధిక అమౌంట్ చోరీ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఆ చోరీ సొత్తును ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అరడజను పైగా ప్రాపర్టీలను ట్రేస్ చేశారు. ఆ ఇద్దరికి చెందిన ఆర్ధిక లావాదేవీలను ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తున్నది. డబ్బు చోరీ కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో అత్యధిక నగదును అవినాశ్ శుక్లా నుంచి రికవరీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే.. అవినాశ్ శుక్లా ఇచ్చిన సమాచారం ప్రకారం 89 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. రెయిడ్ సమయంలో అతని కుటుంబానికి చెందిన ఓ యోగా సెంటర్ నుంచి మరో 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లవ్ కుశ్ మిశ్రా పూర్వీకుల ఇంట్లో ఉన్న ఆవుపేడ కింద దాచిన 12 లక్షల నగుదు కూడా రికవరీ చేశారు. ప్రతి నెలా కేవలం 12 వేల జీతం తీసుకునే మిశ్రా.. ఆలయ చోరీ సొత్తుతో భార్య పేరు మీద 25 లక్షల ఇళ్లు కట్టినట్లు గుర్తించారు. అతని బ్యాంక్ అకౌంట్లు, బినామీ ఆస్తులను పరిశీలిస్తున్నారు.
మనిశ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇంటి నుంచి 36 లక్షలు రికవరీ చేశారు. రాంశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్‌కు చెందిన ఇంటి నుంచి క్యాష్, జ్వలరీ, ప్రాపర్టీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులను కూడా విచారించారు. టెంపుల్ విరాళాలను ఓ ప్రైవేటే ఏజెన్సీ ద్వారా ఆ బ్యాంకు కౌంటింగ్ నిర్వహిస్తోంది. నాలుగు డొనేషన్ బాక్సులకు చెందిన డబ్బును 14 మంది సభ్యుల బృందం లెక్కిస్తుంది. దీంట్లో 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్టు సభ్యులు ఉంటారు.
నిందితులు అకౌంట్ రూమ్‌లోకి యాక్సెస్ సంపాదించి అక్రమ రీతిలో డబ్బును దోచుకున్నట్లు దర్యాప్తుదారులు అంచనా వేశారు. అనుమానిత వ్యక్తుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే, వాళ్ల అకౌంట్లలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయోధ్య విరాళాల చోరీ కేసులో అరెస్టు అయిన వారిలో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ్, రాంశంకర్ యాదవ్ ఉన్నారు. విరాళాల హుండీ నుంచి ఈ 8 మంది డబ్బులు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.