ICMR | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మనం ఏదైనా వ్యాధి బారినపడ్డా, శరీరం లోపలి అవయవాలకు ఇన్ఫెక్షన్లు సోకినా.. వాటి నుంచి మనల్ని కాపేడేవి ‘యాంటీ బయోటిక్స్’. అయితే, వీటి అతి వాడకంతో.. సమయానికి ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం వ్యాధికారక క్రిముల సామర్థ్యాన్ని పెంచిందని, ఈ నేపథ్యంలో మూత్రనాళాలు, రక్తనాళాల ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, న్యుమోనియా వ్యాధులు సాధారణ యాంటీ బయోటిక్స్‌కు లొంగటం లేదని తెలిపింది. ఔషధాల్ని తట్టుకునే శక్తి వ్యాధి కారక క్రిముల్లో ఏర్పడిందన్న సంగతి నివేదిక పేర్కొన్నది. ఈ వ్యాధులను నయం చేయటం ముందు ముందు సవాల్‌గా మారుతుందని నివేదిక అభిప్రాయపడింది. దేశంలో యాంటీ బయోటిక్స్ నిరోధకతకు సంబంధించి ఐసీఎంఆర్ నుండి వెలువడిన 7వ నివేదిక.