సంబల్పూర్ : సంకల్ప బలం ఉండాలే కాని.. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయవచ్చునని నిరూపించాడో 75 ఏండ్ల వృద్ధుడు. ఒడిశా రాష్ట్రం సంబల్పూర్లోని మొడిపడలో నివసించే బాబు లోహర్ పక్షవాతంతో బాధపడుతున్న భార్యను స్థానిక డాక్టర్ల సలహా మేరకు కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో చికిత్స అందించేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే ఆమెను అంత దూరం అంబులెన్స్‌లో తీసుకుపోయే ఆర్థిక శక్తి లేకపోవడంతో తన రిక్షానే అంబులెన్స్‌గా మార్చాడు.
దానిలో ఆమెను ఎక్కించుకుని 300 కి.మీ దూరంలోని కటక్‌కు బయలుదేరాడు. భార్య జ్యోతిని దవాఖానలో చేర్చి రెండు నెలలు చికిత్స అందించి సంబల్పూర్కు బయలుదేరారు. అయితే దారిలో ఈ నెల 19న చౌడ్‌వార్ వద్ద వారి రిక్షాను ఒక వాహనం ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకున్నారు.