భువనేశ్వర్: ఒడిశా(Odisha)లో అదనపు రెవన్యూ అధికారి జితేంద్ర కుమార్ పండాకు చెందిన అత్త ఇంట్లో నుంచి విజిలెన్స్ అధికారులు 75 లక్షల నగదు రికవరీ చేశారు. కటక్ జిల్లాలోని బరాంగ్లో ఈ ఘటన జరిగింది. తాళం వేసిన ఇంటిని అధికారులు సోదాలు చేశారు. అ అధికారి నుంచి మొత్తం 82 లక్షల నగదుతో పాటు బంగారం, స్థిరాస్తులను సీజ్ చేశారు. రెవన్యూ అధికారి పండా ఇంట్లోనే అతని అత్త ఉంటోంది. ఇంటి నుంచి రికవరీ చేసిన డబ్బును ఇంకా లెక్కిస్తున్నట్లు అధికారులు చెప్పారు. విజిలెన్స్ సోదాల్లో ఆ అధికారి అనేక స్థిరాస్తులు ఉన్నట్లు తేలింది. భువనేశ్వర్‌లోనే మూడు ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్లు, రెండు బీహెచ్‌కే ఫ్లాట్ ఉన్నది. ఖోర్దా జిల్లాలో డబుల్ స్టోరీ బిల్డింగ్ ఉన్నది. నాలుగు ఖరీదైన ప్లాట్లు ఉన్నాయి. భువనేశ్వర్‌లోని చాలా సంపన్నమైన ప్రాంతంలో ఆ ప్లాట్లు ఉన్నాయి. మరో లొకేషన్ నుంచి 7 లక్షల నగదు, వంద గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఎస్బీఐ బ్యాంకుకు చెందిన లాకర్ వివరాలను సేకరిస్తున్నారు.