థానే: మహారాష్ట్రలో ఓ 73 ఏళ్ల వృద్ధురాలు మోసపోయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఓ 62 ఏళ్ల వ్యక్తి ఆమె వద్ద 57 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన థానే జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత మహిళ డోంబ్లివ్లి ఏరియాలోని నానా శంకర్సేట్ రోడ్డులో ఉన్న హౌజింగ్ సొసైటీ ఉంటోంది. అయితే ఓ వార్తా పత్రికలో మాట్రిమోనీ యాడ్ ఇచ్చాడు ఆ 62 ఏళ్ల వ్యక్తి. ఆ యాడ్ ద్వారా వృద్ధ మహిళకు అతను పరిచయం అయినట్లు విష్ణు నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వివేక్ కుముత్కర్ తెలిపారు. మాటలతో ఆ మహిళకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. పూణెలో ప్రశాంత జీవితం గడుపుదామని అతను హామీ ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.
పెళ్లికి ముందు పుణెలో ఇళ్లు కొనాలన్న ఉద్దేశాన్ని ఆ మహిళకు వ్యక్తం చేశాడతను. 35 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలని ఆమెను ఒప్పించాడు. నకిలీ ప్రాపర్టీ దస్తావేజులు, ఫోర్జరీ చేసిన బిల్లులు ఆమెకు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు. ఆ మహిళ ఇంట్లో కొన్నాళ్లు తాత్కాలికంగా ఉన్న ఆ వ్యక్తి.. బంగారు ఆభరణాలను దొంగలించాడు. సుమారు 20 లక్షల ఖరీదైన నగలు ఎత్తుకెళ్లాడు. డెబిట్ కార్డును కూడా తీసుకుని సుమారు 2.4 లక్షలు విత్డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు.
వృద్ధురాలిని మోసం చేసిన ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆచూకీ లేని అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం .. భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశామని, నిందితుడిని త్వరలో పట్టుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.