Viral Marriage | ప్రేమ గుడ్డిదని అంటుంటారు.. అది ఎవరితో ఎప్పుడు మొదలవుతుందో అస్సలు ఊహించలేం.. కొన్ని కొన్ని ప్రేమ కథలు విన్నప్పుడు ఇదే నిజమని అనిపిస్తుంది. తాజాగా ఓ 27 ఏళ్ల అమ్మాయి తనకంటే దాదాపు 45 ఏండ్ల పెద్దవాడితో ప్రేమలో పడింది. అతనితో నాలుగేళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె.. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉక్రెయిన్‌కు చెందిన ఈ జంట పెళ్లికి రాజస్థాన్‌లోని సన్సిటీగా పేరుగాంచిన జోధ్‌పూర్ వేదిక కావడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. 72 ఏళ్ల స్టానిస్లావ్కు 27 ఏళ్ల అన్హెలినాతో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తక్కువ సమయంలోనే ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చేశారు. దీంతో ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అలా నాలుగేళ్ల లివ్ ఇన్ రిలేషన్ తర్వాత తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టాలని కొద్ది నెలల క్రితం నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ సంప్రదాయం ప్రకారం కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని భావించారు. తాజాగా ఇండియాకు వచ్చిన ఈ జంట.. రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్‌లో పర్యటించారు. వారికి జోధ్‌పూర్ బాగా నచ్చడంతో.. అక్కడి మెహ్‌రంగ్‌ఘర్ కోటలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
ఖాస్బాగ్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. వరుడు స్టానిస్లావ్ రాయల్ షేర్వాణీ, కేశర పాగా, రత్నాలతో అలంకరించిన తలపాగా ధరించి, గుర్రంపై వివాహ వేదిక వద్దకు వచ్చారు. అతనికి సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. వరమాల కార్యక్రమంలో భాగంగా వధూవరులు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. మంత్రోచ్ఛరణ మధ్య అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడడుగులు వేశారు. ఆ తర్వాత వధువు మెడలో మంగళసూత్రం కట్టి, నుదుటిన సింధూరం పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీరి పెళ్లిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చాలామంది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొందరు మాత్రం ప్రేమ గీమ జాన్తానై.. డబ్బుల కోసమే పెళ్లి చేసుకుని ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.