న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. (Delhi Polls) ఆప్ అధిపతి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో పోటీ చేస్తున్నారు. మొత్తం 1,040 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉప సంహరణ గడువు తర్వాత 981 నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. స్క్రూటినీ తర్వాత 477 నామినేషన్లను తిరస్కరించారు. దీంతో 719 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కాగా, ఇద్దరు ఢిల్లీ మాజీ సీఎంల కుమారులైన బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు), కాంగ్రెస్‌కు చెందిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కుమారుడు) న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్‌తో తలపడుతున్నారు. అయితే ఈ స్థానం నుంచి అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గరిష్టంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు 23 మంది పోటీలో నిలిచారు.
మరోవైపు పటేల్ నగర్, కస్తూర్బా నగర్ స్థానాల్లో అత్యల్పంగా 5 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.