Love Marriage | రాయ్పూర్ : ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు.. మనసులు కలిస్తే ఏ వయసులోనైనా ప్రేమించుకోవచ్చు. వృద్ధాప్య వయసులోనూ ఓ వృద్ధుడు ప్రేమలో మునిగిపోయాడు. 35 ఏండ్ల మహిళను ప్రేమించి పెళ్లాడాడు. ఈ ప్రేమ పెళ్లి ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బిలాస్పుర్లోని సర్కండ చింగ్రాజ్పర గ్రామానికి చెందిన దాదురామ్ గంధర్వ(70) అనే వృద్ధుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న 35 ఏండ్ల మహిళపై ఆ తాత మనసు పారేసుకున్నాడు. తాను ప్రేమిస్తున్నట్లు తాత ఆమెకు చెప్పాడు. ఆ మహిళ కూడా క్షణం ఆలోచించకుండా వృద్ధుడి ప్రేమను అంగీకరించింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇరు కుటుంబాల సభ్యులు కలిసి తమ సంప్రదాయ పద్ధతుల్లో వృద్ధుడికి, మహిళకు ఘనంగా వివాహం జరిపించారు. స్థానికంగా ఉన్న శివాలయంలో మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్కటయ్యారు. నూతన వధూవరులను బంధువులు ఆశీర్వదించారు. మొత్తానికి కుటుంబ సభ్యుల సహకారంతో వీరు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.