Himachal Pradesh | ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భారీగా మంచు కురుస్తోంది (Heavy Snow Fall). అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి.
అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన మంచు పరిస్థితుల దృష్ట్యా అధికారులు పలు రహదారులను మూసివేశారు. ఐదు జాతీయ రహదారులు సహా 650 రహదారులను మూసివేసినట్లు (Roads Closed) అధికారులు సోమవారం తెలిపారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లాహౌల్ – స్పితి (Spiti) జిల్లాలోని స్పితి వ్యాలీలో భారీగా మంచు కురుస్తున్న కారణంగా అధికారులు దాదాపు 290 రహదారులను మూసివేశారు. సిమ్లాలో 149, చంబాలో 100, కిన్నౌర్‌లో 75, కులులో 32, మండిలో ఐదు, కాంగ్రాలో ఒక రహదారిని అధికారులు మూసివేశారు.
మరోవైపు స్పితి వ్యాలీలో రోడ్లు మూసివేత కారణంగా అక్కడ సుమారు 81 మంది పర్యాటకులు చిక్కకుకుపోయారు. వారందరినీ ఆదివారం రాత్రి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. భారీ హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్‌కు కూడా అంతరాయం కలిగినట్లు వివరించారు.
ఆదివారం లాహౌల్ – స్పితిలోని జస్రత్ గ్రామ సమీపంలో గల దారా జలపాతాన్ని భారీగా హిమపాతం తాకింది. అక్కడ నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. జోబ్రాంగ్, రాపి, జస్రత్, తరండ్, థారోట్ చుట్టుపక్కల గ్రామాల నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
Also Read..
Nikki Haley | అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం.. వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌పై గెలుపు
Nita Ambani | సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న నీతా అంబానీ.. VIDEO