న్యూఢిల్లీ: గత ఏడాది సుమారు 64 శాతం భారతీయ కంపెనీలపై ర్యాన్సమ్ వేర్ అటాక్(Ransomware Attacks) జరిగినట్లు గ్లోబల్ సెబర్సెక్యూర్టీ సంస్థ సోఫోస్ తెలిపింది. నిజానికి ప్రతి ఏడాది దాడుల సంఖ్య తగ్గుతున్నా.. బాధితులపై ప్రభావం మాత్రం రెట్టింపు అవుతోందని ఆ సంస్థ వెల్లడించింది. సగటున 4.8 మిలియన్ల డాలర్ల బెదిరింపు వసూళ్లు జరుగుతున్నట్లు అంచనా వేశారు. దీంట్లో 62 శాతం కేసుల్లో కనీసం మిలియన్ల డాలర్ల డిమాండ్ జరుగుతున్నట్లు తేలింది.
ర్యాన్సమ్వేర్ సాఫ్ట్‌వేర్‌తో కంప్యూటర్లు, సర్వర్లపై హ్యాకర్లు అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకుంటే, ఫైల్స్ కోల్పోతారని బెదిరింపులు కూడా చేస్తుంటారు. అయితే 2022లో జరిగిన ర్యాన్సమ్వేర్ దాడుల కన్నా.. 2023లో ఆ దాడుల సంఖ్య తగ్గినట్లు తేలింది. స్టేట్ ఆఫ్ ర్యాన్సమ్వేర్ ఇన్ ఇండియా 2024 రిపోర్టును రిలీజ్ చేశారు. ఆ రిపోర్టు ప్రకారం 2022లో 73 శాతం ఉన్న దాడులు.. 2023 నాటికి 64 శాతానికి పడిపోయినట్లు తేలింది. దాడుల సంఖ్య తగ్గినా.. బాధితులను డబ్బు వసూల్ చేసే అంశంలో తీవ్రత పెరిగిందన్నారు. అయిదు వేల ఐటీ కంపెనీ ఉద్యోగులను విచారించిన తర్వాత ఈ ద్రువీకరణకు వచ్చారు.
61 శాతం బాధితులు తమ డేటాను వారం రోజుల్లోగా రికవరీ చేసుకున్నారు. సుమారు 96 శాతం మంది దాడుల గురించి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంట్లో 70 శాతం కేసులకు విచారణ అధికారుల సహకారం అందుతోంది. ర్యాన్సమ్వేర్ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడమే కీలకమని సోఫోస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సునిల్ శర్మ తెలిపారు.