కీవ్: ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో నూతన సంవత్సరం ఆదిలోనే రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రష్యా బలగాలే లక్ష్యంగా ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యా వైపు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఈ విషయాన్ని రష్యా కూడా ధ్రువీకరించింది. ఈశాన్య డోనెట్స్ ప్రాంతంలోని రష్యా సైనిక బలగాల క్యాంపు లక్ష్యంగా అమెరికా సరఫరా చేసిన ఆరు రాకెట్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. వీటిలో రెండు రాకెట్లను కూల్చేశామని చెప్పింది. ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 63 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా ప్రకటించింది. అయితే, తమ దాడిలో దాదాపు 400 మంది రష్యా సైనికులు మరణించారని, 300 మంది వరకు గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని విద్యుత్తు వ్యవస్థను ధ్వంసం చేసే లక్ష్యంతో రష్యా ప్రయోగించిన 40 డ్రోన్లను తమ వాయుసేన కూల్చేసిందని ఉక్రెయిన్ ప్రకటించింది. కాగా, సరిహద్దులోని తమ గ్రామంపైన కూడా ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసిందని రష్యా ఆరోపించింది.