న్యూఢిల్లీ: సుమారు ఆరు వేల కోట్లకు సంబంధించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వాస్తవానికి డిసెంబర్ 2023లో అతన్ని దుబాయ్‌లో అరెస్టు చేశారు. భారత్‌కు అతన్ని అప్పగిస్తారని ఆశిస్తున్న సమయంలో రవి ఆచూకీ చిక్కడం లేదని తెలిసింది. ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసు ఆధారంగా రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే 45 రోజుల తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. కానీ పోలీసులు నిఘాలోనే ఉన్నాడతను.
తాజా సమాచారం ప్రకారం మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిందితుడు రవి మిస్సింగ్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం అతని అప్పగింతను నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి ఆ నిందితుడు పరారీ అయినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో డాక్యుమెంట్లు అందని కారణంగా రవి ఉప్పల్ అప్పగింతను తిరస్కరించినట్లు యూఏఈ అధికారులు చెప్పారు. ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న దక్షిణ పసిఫిక్ సముద్ర ద్వీపం వనువాటులో అతనికి పాస్‌పోర్టు ఉన్నది. ఈ ద్వీపం ఆస్ట్రేలియాకు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
2018లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ బయటకు వచ్చింది. రోజుకు ఆ యాప్ ద్వార సుమారు 200 కోట్లు జనరేట్ అయ్యేవి. సుమారు ఆరు వేల కోట్ల మేర బెట్టింగ్ నెట్వర్క్ ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా3200 మంది దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని కొన్ని సిటీలతో పాటు మలేషియా, థాయిలాండ్ ఉన్నాయి. పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులతో చంద్రకార్, ఉప్పల్‌కు మంచి లింకులు ఉన్నాయి. దర్యాప్తు సంస్థ నిఘాలో పడకుండా ఉండేందుకు పేమెంట్స్ అన్నీ యాప్ ద్వారా చేశారు.
చత్తీస్ఘడ్ మాజీ సీం భూపేశ్ భగల్ లబ్ధి పొందినట్లు ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆ యాప్ నుంచి 508 కోట్లు తీసుకుని భగల్ ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.