న్యూఢిల్లీ : బీజేపీ పాలిత పశ్చిమ బెంగాల్లో ఘోర ఘటనలు చోటుచేసుకున్నాయి. మాల్డా వైద్య కళాశాల-దవాఖాన(ఎంఎంసీహెచ్)లో ఈనెల మొదటి మూ డు వారాల్లో 60 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైద్య కళాశాల నుంచి సవివర నివేదికను పశ్చిమ బెంగాల్ వైద్య శాఖ కోరింది. ఈ మరణాల సంఖ్యలో రెండవ వారంలో ఒకే రోజు నమోదైన 10 మరణాలు కూడా ఉన్నాయి. ఈ సంఖ్య దవాఖానకు రోగులను పంపే ప్రక్రియ(రెఫరల్ వ్యవస్థ)పై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఆ రోజు మరణించిన 10 మంది శిశువులలో 8 మంది ఇతర దవాఖానలలో జన్మించి పరిస్థితి విషమించడంతో ఎంఎంసీహెచ్కి తరలివచ్చారు.
మిగిలిన ఇద్దరు శిశువులు మాత్రం అదే దవాఖానలో జన్మించారు. ఎంఎంసీహెచ్ పనితీరుపై సమీక్ష జరపాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. అలాగే వైద్య కళాశాలకు తరలించడానికి ముందు చాలామంది పిల్లలకు చికిత్స అందించిన ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్ హోమ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. నవజాత శిశువులకు చికిత్స అందించిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం శ్వాసకోశ సమస్యలు, కామెర్లు, పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత రుగ్మతలు వంటి వివిధ కారణాల వల్ల ఈ మరణాలు సంభవించాయి. ఆగస్టు నెలలో నమోదైన 60 మరణాలలో 44 మంది శిశువులు వేరే చోట జన్మించి ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఎంఎంసీహెచ్కి రిఫర్ చేయబడినవారేనని రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక పేర్కొంది.