చెన్నై: యువకుడి కస్టడీ మరణానికి సంబంధించి ఆరుగురు పోలీసులు అరెస్ట్ అయ్యారు. హత్య సెక్షన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద వారిపై కేసులు నమోదు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 18న వాహనాల తనిఖీ సందర్భంగా విఘ్నేష్, సురేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ఆటోలో గంజాయ్, మద్యం ఉండటంతో సెక్రటేరియట్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. విఘ్నేష్ సరిగా సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు బాగా కొట్టారు. దీంతో కస్టడీలో ఉన్న విఘ్నేష్ ఆ మరునాడు మరణించాడు. అతడి శరీరంలో పలు భాగాలు విరగడం, తీవ్ర గాయాల వల్ల చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.
మరోవైపు ఈ సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. దీంతో సీఎం స్టాలిన్ ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ అయిన సీబీ-సీఐడీకి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, హోంగార్డులను సస్పెండ్ చేశారు. శుక్రవారం పలువురు పోలీసులను విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు మునాఫ్, పొన్రాజ్, హెడ్ కానిస్టేబుల్ కుమార్, హోంగార్డు దీపక్, ఇద్దరు ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్‌ను శనివారం అరెస్ట్ చేశారు.
కాగా, 25 ఏళ్ల మృతుడు దళిత వ్యక్తి కావడంతో ఎస్టీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్లను కూడా చేర్చాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తమిళనాడు పోలీసులను ఆదేశించింది. దీంతో అరెస్టైన పోలీసులపై హత్య సెక్షన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.