ఎఫ్ఏఏకు అమెరికా కంపెనీల లేఖ
వాషింగ్టన్: అమెరికాలో బుధవారం నుంచి అమల్లోకి రానున్న 5జీ సీ-బ్యాండ్ సర్వీసులతో ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని రాడార్ సిగ్నళ్లకు, విమానాల్లోని రేడియో అల్టీమీటర్లకు అంతరాయం కలుగుతుందని, దీంతో ల్యాండింగ్ సమయంలో విమాన పైలట్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదమున్నదని ‘ఎయిర్లైన్స్ ఆఫ్ అమెరికా’ కూటమి ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దీంతో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులతో పాటు, వైద్య సామగ్రి, ఇతర వస్తువులను డెలివరీ చేసే లాజిస్టిక్ విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పేర్కొంది. 5జీ అమలును మరికొన్ని రోజులు వాయిదా వేయాలని, ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని దాదాపు 2 మైళ్ల పరిధిలో 5జీ సేవలను నిలిపివేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)కు లేఖ రాసింది. అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, అలస్కా ఎయిర్, యునైటెడ్ ఎయిర్లైన్స్, జెట్ బ్లూ ఎయిర్వేస్, ఫెడ్ఎక్స్ ఎక్స్ప్రెస్, సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ సంస్థలు లేఖ రాసిన వాటిలో ఉన్నాయి. త్వరలో దేశంలో తీసుకురానున్న 5జీ సర్వీసులు భారత వైమానిక రంగంపై చూపించే ప్రభావంపై దృష్టిసారించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్లు ఈ నెల 4న కేంద్రానికి లేఖ రాశారు.