కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 30: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కరడు గట్టిన మావోయిస్టులు సైతం ఉన్నారు. ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్రయాదవ్ ఆదివారం వెల్లడించారు.
బీజాపూర్ జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘నియద్ నెల్లనార్’ కార్యక్రమానికి ఆకర్షితులైన మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆపరేషన్లతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
వారు తమ పార్టీ సిద్ధాంతాలపైనా అసంతృప్తికి లోనై, ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన వారిలో 14 మందిపై మొత్తం రూ.68 లక్షల రివార్డు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు అనుసంధానంగా ఉన్న బెటాలియన్లకు చెందిన వారున్నారని చెప్పారు. నక్సల్స్ లొంగుబాటును కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వాగతించారు.