జైపూర్: కాంక్రీట్ స్లాబ్ కూలడంతో కింద ఉన్న కాలువలో ఐదుగురు వ్యక్తులు పడ్డారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని బాబా బావడి ప్రాంతంలో కాంక్రీట్ స్లాబ్ ఉన్న కాలువపై ఒక వ్యక్తి టైర్ పంక్చర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి 9.30 గంటలకు నలుగురు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి కూర్చొని బైక్ రిపేర్ చేస్తున్నాడు. వారు మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా వారు ఉన్న చోట కాంక్రీట్ స్లాబ్ కూలింది. దీంతో కింద ఉన్న కాలువలోకి ఆ ఐదుగురు పడిపోయారు. బైక్ కూడా వారిపై పడింది. గమనించిన ఒక వ్యక్తి సహాయం కోసం పరుగున అక్కడకు వచ్చాడు.
కాగా, ఆ కాలువ ఎండిపోయి ఉండటంతో ఆ ఐదుగురికి పెద్దగా ఏమీ కాలేదు. వారు స్వల్పంగా గాయపడ్డారు. అయితే స్లాబ్ కూలిన పక్కనే చాలా టైర్లు కుప్పుగా ఆ డ్రైన్‌పై ఉన్నాయి. మరోవైపు అక్కడ సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.