కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ఏజెన్సీ ప్రాంతంలో తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య శనివారం జరిగిన భీకర పోరులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మరోవైపు మావోయిస్టు పార్టీ నేత అభయ్ ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ప్లీనరీ నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో బీఎస్ఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ బలగాలతోపాటు మహారాష్ట్ర సీ-60 బలగాలు సైతం కూంబింగ్ చేపట్టాయి.
నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మాడ్ అడవుల్లో ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలు శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఇరువర్గాల మధ్య సుమారు గంటపాటు భీకర పోరు కొనసాగింది. మావోయిస్టులు జవాన్లపైకి కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారి ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ వెల్లడించారు.