PMJAY | న్యూఢిల్లీ: వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్నేండ్ల క్రితం ప్రారంభించారు. 70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేదు. ఆధార్ కార్డు ఉంటే చాలు. కుటుంబంలోని వయోవృద్ధులు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను పొందవచ్చు. దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో ఉన్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులు ఈ పథకానికి అర్హులు. ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే, వారంతా కలిసి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. అంటే, కుటుంబానికి రూ.5 లక్షల వరకు మాత్రమే లబ్ధి పొందడానికి వీలవుతుంది.
70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారు, వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా, ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై సీనియర్ సిటిజన్ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరినవారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ వయ్ వందన కార్డును అందజేస్తారు.
ఆయుష్మాన్ వయ్ వందన కార్డును నమోదు చేయించుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. వయసు నిర్ధారణకు ఇది తప్పనిసరి. వృద్ధుల ఆర్థిక స్తోమతతో సంబంధం లేదు.
ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై సీనియర్ సిటిజన్ పథకంలో చేరడానికి ఆధార్ సరిపోతుంది. ఇతర డాక్యుమెంట్లు అక్కర్లేదు.
పీఎంజేఏవై పథకంలో చేరిన మొదటి రోజు నుంచి చికిత్స పొందడానికి అర్హులే. చికిత్స కోసం వెయిటింగ్ పీరియడ్ నిబంధన లేదు. కాబట్టి ఈ బీమా కవరేజ్ తక్షణమే ప్రారంభమవుతుంది.
ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం నుంచి వైదొలగి, పీఎంజేఏవైలో చేరినవారు మళ్లీ ఆ ప్రభుత్వ ఆరోగ్య పథకానికి మారడానికి వీలుండదు. పీఎంజేఏవైలోనే కొనసాగాలి.
www.beneficiary.nha.gov.in పోర్టల్ ద్వారా పీఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ఆయుష్మాన్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే, మొదటి వ్యక్తి వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత ‘యాడ్ మెంబర్’పై క్లిక్ చేసి మరొకరి వివరాలను నమోదు చేయాలి. ఒక్కొక్కరికి వేర్వేరుగా నమోదు చేయనక్కర్లేదు.