పాట్నా: ఒక బాలుడి పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్కెస్ట్రా’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదుపుతప్పిన ఒక బస్సు అక్కడ డ్యాన్స్ చేస్తున్న గుంపుపైకి దూసుకెళ్లింది. ఆ బాలుడి తండ్రితో సహా ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. (Bus Rams Into Crowd) బీహార్లోని బెట్టియాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి బెట్టియా నగర శివారు ప్రాంతంలో ఒక బాలుడి పుట్టిన రోజు సందర్భంగా రోడ్డు పక్కన ‘ఆర్కెస్ట్రా’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ‘ఆర్కెస్ట్రా’ బృందం పాటలకు బాలుడి తండ్రితో సహా పలువురు డ్యాన్స్ చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి బెట్టియా వస్తున్న బస్సు అదుపుతప్పింది. ఒక లారీని ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో ‘ఆర్కెస్ట్రా’ ప్రదర్శన ముందు డ్యాన్స్ చేస్తున్న వారిపైకి ఆ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలుడి తండ్రి దేవేంద్ర దూబేతో పాటు బంధువులైన మరో నలుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు గాయపడిన వారిని బెట్టియాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.