తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 30. తెలంగాణ సాంస్కృతిక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కళాకారులతో వెంటనే భర్తీ చేయాలని ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యోగాల కల్పన కోరుతూ బుధవారం కళాకారులు గన్‌పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, పలు పోలీస్స్టేషన్లకు తరలించారు.
అనంతరం ఉద్యమ కళాకారుల సంఘం వ్యవస్థాపకుడు అనువోజు వెంకటేశం, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దరువు వెంకన్న, నకిరెకంటి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి కళాకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత కళాకారుల సమస్యలపై నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కళాకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరచాలని, లేకుంటే అసెంబ్లీ, సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.