జైపూర్ : రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ జైలు(Jaipur Central Jail) ఖైదీలు ఫుల్ ఎంజాయ్ చేశారు. రెగ్యులర్‌గా జరిగే హాస్పిటల్ విజిట్ పేరుతో.. ఓ అయిదుగురు ఖైదీలు పిక్నిక్ వెళ్లారు. 5 నిమిషాల ఆస్పత్రి విజిట్ కాస్త.. సిటీ టూర్‌గా మారింది ఆ ఖైదీలకు. బ్రేక్ టైంలో వాళ్లు హోటళ్లకు వెళ్లారు. భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను కలిశారు. పోహా బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారు. ఈ కేసులో అయిదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఖైదీలు, నలుగురు బంధువులను అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వెళ్లి స్వేచ్ఛగా గడిపేందుకు కానిస్టేబుళ్లకు ఖైదీలు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలుఉన్నాయి.
రఫిక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే ఖైదీలు ఆస్పత్రి విజిట్ పేరుతో సిటీలో చక్కర్లు కొట్టారు. ఎస్ఎంఎస్ ఆస్పత్రి వెళ్లేందుకు మెడికల్ చెకప్ అప్రూవల్ తీసుకున్న ఆ నలుగురు హంగామా చేశారు. కేవలం ఒకే ఒక్క ఖైదీ మాత్రం చెప్పినట్లు జైలుకు వచ్చాడు. సాయంత్రం 5.30 నిమిషాల వరకు ఖైదీల్లో ఒక్కరు కూడా టైంకు రాలేదు.
రఫిక్, బన్వర్లు.. భార్యలను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను కలిశారు. జాలుపుర హోటల్ వద్ద వాళ్లు కలుసుకున్నారు. ఆ తర్వాత రఫిక్ భార్య నార్కోటిక్స్ మత్తు పదార్ధాలతో దొరికింది. ఎన్డీపీఎస్ చట్టం కింద ఆమెపై కేసు బుక్ చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న ఓ హోటల్లో అంకిత, కరణ్ ఉన్నట్లు గుర్తించారు. బ్రేక్‌ఫాస్ట్‌లో వాళ్లు పోహా తీసుకున్నారు. అంకిత గర్ల్‌ఫ్రెండ్ రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఓ హోటల్ వద్ద కరణ్ బంధువు ఒకరు 45 వేల నగదుతో దొరికాడు. అనేక మంది ఖైదీల ఐడీ కార్డులను కూడా గుర్తించారు.
జైలులో ఉన్న ఖైదీలు రహస్యంగా ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి సుమారు 200 ఫోన్ కాల్స్‌ను పరిశీలించామని, దాని ద్వారా ఖైదీల గురించి తెలిసినట్లు దర్యాప్తుదారులు చెప్పారు. సవాయి మాన్ సింగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. జైపూర్ సెంట్రల్ జైలులో అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.