అగర్తలా: పోలీస్ కస్టడీలో ఉన్న గిరిజన వ్యక్తి అస్వస్థతకు గురై మరణించాడు. పోలీసులు అతడ్ని చిత్రహింసలకు గురి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయడంతోపాటు వారిని అరెస్ట్ చేశారు. (Cops Arrested) దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్లో ఈ సంఘటన జరిగింది. రబ్బరు షీట్ల చోరీ ఆరోపణలపై గిరిజన వ్యక్తులైన 34 ఏళ్ల బాదల్ త్రిపుర, చిరంజిత్ త్రిపురను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆ మరునాడు వారిని విడిచిపెట్టారు.
కాగా, తీవ్ర అస్వస్థతకు గురైన బాదల్‌ను కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతడు మరణించాడు. దీంతో బాదల్ మృతికి పోలీసుల చిత్రహింసలు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతడి శరీరం, కళ్లపై పలు గాయాలు ఉన్నాయని తెలిపారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 16న ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. నష్ట పరిహారం చెల్లించాలని, బాధ్యులైన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు స్థానికుల ఆందోళన నేపథ్యంలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. మనుబజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ ప్రేమ్‌జిత్ రే, కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు దక్షిణ త్రిపుర ఎస్పీ అశోక్ సిన్హా తెలిపారు. వారిపై కేసు నమోదు చేయడంతోపాటు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.