లక్నో: పెట్రోల్ బంకుల్లో జరుగున్న మోసాన్ని ఒక వ్యక్తి బయటపెట్టాడు. 45 లీటర్ల సామర్థ్యం ఉన్న కారు ట్యాంకులో 52 లీటర్లకుపైగా పెట్రోల్ నింపినట్లు బంకు సిబ్బంది బిల్లు ఇచ్చినట్లు ఆరోపించాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. (fuel pump scam) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. చరణ్ సింగ్ ఇటీవలే కొత్త కారును కొనుగోలు చేశాడు. అతడు పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. ట్యాంక్‌లో సుమారు ఐదు లీటర్ల పెట్రోల్ మిగిలి ఉన్నట్లు ఫ్యూయల్ ఇండికేటర్ చూపించింది.
కాగా, తన కారులో ట్యాంక్ ఫుల్‌గా పెట్రోల్ నింపమని బంకు సిబ్బందిని చరణ్ సింగ్ కోరాడు. ఆ కారు ట్యాంక్ పూర్తి సామర్థ్యం 45 లీటర్లు. అందులో 5 లీటర్ల పెట్రోల్ ఉన్నది. అయినప్పటికీ 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు బంకు సిబ్బంది బిల్లు ఇచ్చాడు. ఇది చూసి కారు యజమాని చరణ్ సింగ్ షాక్ అయ్యాడు. దీని గురించి బంకు సిబ్బందిని నిలదీశాడు.
మరోవైపు తొలుత కారు ట్యాంకులో 41 లీటర్ల పెట్రోల్‌ను బంకు సిబ్బంది నింపినట్లు చరణ్ సింగ్ గ్రహించాడు. ఆ తర్వాత మీటర్ రీడింగ్‌ను మార్పు చేసి అదనంగా 11 లీటర్లు నింపినట్లు బిల్లులో చూపినట్లు ఆరోపించాడు. ఈ మోసాన్ని బయటపెట్టేందుకు కారు తయారీ సంస్థ ప్రతినిధిని అక్కడకు పిలిపించాడు.
ఆ కారు కంపెనీ ప్రతినిధి ఆ పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నాడు. కారు ట్యాంక్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ పట్టదని అధికారికంగా ధృవీకరించాడు. దీంతో చరణ్ సింగ్ ఆ పెట్రోల్ బంకుపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మోసపూరిత చిప్‌లు, డిస్పెన్సింగ్ యంత్రాల తనిఖీ కోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.