అడిలైడ్: భారతీయ సంతతికి చెందిన ఓ జంట.. ఆస్ట్రేలియాలోని(Australia) అడిలైడ్ వీధులో గొడవ పడ్డారు. అటుగా వెళ్తున్న పోలీసులు ఆ ఇద్దర్నీ ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 42 ఏళ్ల గౌరవ్ కుండి అనే వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్ట్రేలియా పోలీసులు అతన్ని తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. గౌరవ్ కుండి, అమృతపాల్ కౌర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ గౌరవ్ కుండి.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని బ్రెయిన్, మెడకు గాయాలయ్యాయి.
అడిలైడ్ వీధుల్లో కుండి, కౌర్ ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. భార్యాభర్తలు గొడవపడుతున్నట్లు గ్రహించిన పోలీసులు రంగప్రవేశం చేశారు. గృహ హింస కేసుగా భావించిన పోలీసులు ఆ జంటను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుండిని అరెస్టు చేసే సమయంలో .. పోలీసులు అతన్ని గట్టిగా నొక్కి పెట్టారు. ఆ సమయంలో ఆ ఘటనను కౌర్ తన మొబైల్లో బంధించారు.
నేనేమీ తప్పుచేయలేదని కుండి బిగ్గరగా అరిచాడు. అతని వదిలేయాలని కౌర్ పోలీసుల్ని వేడుకున్నది. కానీ వాళ్లు వినిపించుకోలేదు. గౌరవ్‌ను పట్టుకుని, మెడలు వంచేశారు. తలను కారుకు నెట్టేశారు. దీంతో గౌరవ్ స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం రాయల్ అడిలైడ్ ఆస్పత్రిలో అతన్ని చేర్పించారు. బ్రెయిన్ డ్యామేజ్, మెడకు గాయాలు అయినట్లు డాక్టర్లు చెప్పారు.
దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు బాడీ కెమెరాలకు చెందిన వీడియోలను కూడా సమీక్షిస్తున్నారు.