AC auto : ఏసీ కార్లు, ఏసీ బస్సులు, ఏసీ ట్రక్కుల గురించే తెలుసు. కానీ, ఆటోలో కూడా ఏసీ ఉండటం ఎప్పుడైనా చూశారా..? లేదు కదూ. అయితే, అలాంటి ఆటోను చూడాలంటే హరియాణాలోని గుర్గావ్ వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక ఆటోలో ఏసీ ఏర్పాటు చేశారు. గుర్గావ్, ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఎండలు భారీగా మండుతున్నాయి.
ఎండపూట బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. అందులోనూ టీ వీలర్లు, ఆటోరిక్షాల్లో వెళ్లాలంటే వడదెబ్బ భయంతో అల్లాడిపోతున్నారు. కానీ, ఒక్క ఆటోలో మాత్రం ఎంతటి ఎండలోనైనా నిరభ్యంతరంగా ప్రయాణించవచ్చు. అందులోని ఏసీ నుంచి వచ్చే చల్లని గాలితో సేదతీరవచ్చు. అక్కడి రూల్స్ ప్రకారం నీలి రంగులో ఉన్న ఈ ఆటో రిక్షా బయటి నుంచి చూస్తే అన్ని ఆటోల్లాగే సాధారణంగా అనిపిస్తుంది. పూర్తిగా డోర్లు, విండోస్ మూసి ఉండే ఈ ఆటో లోపల లేటెస్ట్ ఎయిర్ కండీషన్డ్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు యజమాని. దీంతో ఇతర కార్లలో ఎలాగైతే చల్లగా ఉంటుందో.. ఈ ఆటోలో కూడా అలాంటి చల్లదనమే ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను ఒక యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది. చాలా మంది యూజర్లు ఖరీదైన కార్లకంటే చవకగా దొరికే ఈ ఆటోనే బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అన్ని చోట్లా ఇలాంటి ఏసీ ఆటోలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.