ఇండోర్: బాంబే బ్లడ్ గ్రూప్.. అత్యంత అరుదైన గ్రూప్ ఇది. ఇలాంటి బ్లడ్‌గ్రూపే కలిగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ ప్రాణాలు కాపాడేందుకు ఓ వ్యక్తి ఏకంగా 400కుపైగా కిలోమీటర్లు ప్రయాణం చేసి రక్తదానం చేశాడు. మహారాష్ట్రలోని షిర్డీకి రవీంద్ర అష్తేకర్ (36) పూల వ్యాపారి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ (30) దవాఖానలో ప్రాణాలతో పోరాడుతున్నదని, ఆమెకు అర్జెంటుగా బాంబే బ్లడ్‌గ్రూప్ కావాలన్న వాట్సాప్ మెసేజ్ చూసిన రవీంద్ర వెంటనే స్నేహితుడి కారులో బయలుదేరాడు. 440 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నెల 25న రక్తదానం చేసి ఆ మహిళ ప్రాణాలను కాపాడగలిగాడు. అత్యంత అరుదైన బ్లడ్‌గ్రూప్ కలిగిన రవీంద్ర రాష్ర్టాలతో సంబంధం లేకుండా ఎక్కడ ఎవరికి అవసరం పడినా వెంటనే వెళ్లి రక్తదానం చేస్తారు. ఇలా మహారాష్ట్రతోపాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో గత పదేండ్లలో 8 సార్లు రక్తదానం చేశారు. బాంబే బ్లడ్‌గ్రూప్‌ను 1952లో కనుగొన్నారు. ఇందులో ‘హెచ్’ యాంటీజెన్‌కు బదులుగా యాంటీ-హెచ్ యాంటీబాడీస్ ఉంటాయి. వీరికి ఆ గ్రూపు కలిగిన వారే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది.