కోల్కతా: ఆవును కాపాడబోయి ఒక కుటుంబంలోని నలుగురు మరణించారు. విద్యుదాఘాతానికి గురై వృద్ధులైన భార్యాభర్తలు, వారి కుమారుడు, మనుమడు చనిపోయారు. (Family Electrocuted) ఆ సమయంలో ఇంట్లో లేని వారి కోడలు ఈ దుర్ఘటన నుంచి తప్పించుకున్నది. పశ్చిమ బెంగాల్లోని జలపైగురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం టాకిమరి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మిథున్ పొలం నుంచి ఆవును ఇంటికి తీసుకెళ్తున్నాడు. షెడ్డు బయట నిలిచిన నీటిలో పడి ఉన్న కరెంట్ వైరు ఆవుకు తగిలింది. ఈ నేపథ్యంలో ఆవును రక్షించేందుకు ప్రయత్నించిన మిథున్ విద్యుదాఘాతానికి గురై మరణించాడు.
కాగా, మిథున్ అరుపులు విన్న 60 ఏళ్ల తండ్రి పరేష్, తల్లి దీపాలి తమ కుమారుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కూడా కరెంట్ షాక్తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మిథున్ కుమారుడైన రెండేళ్ల సుమన్ కూడా ఈ సంఘటనలో మరణించాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో మిథున్ భార్య ఇంట్లో లేదని పోలీసులు వెల్లడించారు.