కొత్తగూడెం క్రైం, జనవరి 5: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మావోయిస్టులు, ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ – దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో నాలుగు జిల్లాల భద్రతా దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ నిర్వహించాయి.
నారాయణ్‌పూర్ జిల్లాతోపాటు దంతేవాడ, కొండగావ్, జగ్దల్పూర్ జిల్లాల రిజర్వు గార్డు (డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నరపాటు భీకరపోరు జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో డీఆర్జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ మృతిచెందాడు.