లక్నో: వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి దేశంలో కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరవచ్చని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఐటీ కాన్పూర్ అధ్యయనం అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచే దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు కరోనా థర్డ్ వేవ్‌పై మోడలింగ్ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన బృందం దేశంలో వ్యాక్సిన్ డేటాను పరిగణలోకి తీసుకోలేదు. ఇతర దేశాల్లో కరోనా ట్రెండ్లు, దేశంలో ఫస్ట్, సెకండ్ వేవ్ డేటా ఆధారంగా అధ్యయనం చేశారు. ఇతర దేశాలలో కనిపించే ట్రెండ్లను భారత్ కూడా అనుసరిస్తుందనే ఊహా ఆధారంగా రిపోర్ట్ రూపొందించారు.
‘అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యా వంటి అనేక దేశాలలో, మెజారిటీ ప్రజలు టీకాలు తీసుకున్నారు. కానీ వారు ప్రస్తుతం థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటున్నారు. కాబట్టి, భారతదేశం, ఇతర దేశాలు కరోనాపై పోరుకు ఏర్పాట్లు చేసుకోవాలి. మరొక వేవ్‌కు సిద్ధంగా ఉండాలి. అయితే మునుపటి వాటి వలె ఈ వేవ్ వినాశకరమైనది కాదు’ అని అధ్యయన రచయితలు వివరించారు. కరోనా థర్డ్ వేవ్ ప్రొజెక్షన్ కోసం గాస్సియన్ మిక్స్చర్ మోడల్ అనే గణాంక సాధనాన్ని ఉపయోగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ రిపోర్ట్‌పై ఇంకా ముందస్తు సమీక్ష జరుగలేదు.