న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఇకనుంచి విమాన ప్రయాణికులు తమ బ్యాగేజీ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను బయటకు తీసి చూపాల్సిన అవసరం లేదని, వాటిని తనిఖీ చేసేందుకు కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నాలజీని వినియోగించాలని విమానయాన భద్రతా విభాగం బీసీఏఎస్ సిఫారసు చేసింది. ప్రస్తుతం విమానాశ్రయాల్లో బ్యాగేజీలోని వస్తువుల టూ-డైమెన్షనల్ దృశ్యాలను చూపే స్కానర్లు ఉన్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ టోమోగ్రఫీ పరికరాలను ఏర్పాటు చేస్తే త్రీడీ దృశ్యాలు కనిపిస్తాయని బీసీఏఎస్ జాయింట్ డైరెక్టర్ జనరల్ జైదీప్ ప్రసాద్ పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. వీటిని ఉపయోగిస్తే తనిఖీలు వేగవంతం అవుతాయని అన్నారు. ఇటీవలి కాలంలో తనిఖీల వద్ద రద్దీ, ఆలస్యంపై ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. బీసీఏఎస్ విమానయాన శాఖ పరిధిలో పనిచేస్తుంది. విమానాశ్రయాల తనిఖీలపై సంబంధింత విభాగాలు సమీక్ష నిర్వహిస్తున్నాయని ఆ శాఖమంత్రి వీకే సింగ్ ఈనెల మొదటివారంలో లోక్సభలో చెప్పారు.