Shivaji Maharaj Statute Collapses | మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన శివాజీ భారీ విగ్రహం కూలిపోయింది. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్లో 35 అడుగులు ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. మల్వాన్లోని రాజ్కోట్ వద్ద ఏర్పాటు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కూలిపోయిందని ఓ అధికారి పేర్కొన్నారు. విగ్రహం కుప్పకూలడానికి కారణాలు తెలియదని చెప్పారు. కారణాలను నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. అయితే, గత రెండుమూడు రోజులుగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. విగ్రహం కూలిన అనంతరం సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నామని, నష్టాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నేవీ డే సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న ప్రధాని నరేంద్ర మోదీ మరాఠా యోధుడు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. విగ్రహం కూలిన ఘటనపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపం కారణంగానే విగ్రహం కూలిపోయిందిన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంతి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విగ్రహం కూలిపోయిందని.. నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కేవలం కార్యక్రమం నిర్వహణపై మాత్రమే దృష్టి సారించిందని విమర్శించారు.
ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు మాత్రమే జారీ చేస్తుందని.. కమిషన్లు తీసుకొని తదనుగుణంగా కాంట్రాక్టులు ఇస్తుందని మండిపడ్డారు. శివసేన యూబీటీ ఎమ్మెల్యే వైభవ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పనుల్లో నాణ్యత లేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం తప్పించుకోవచ్చని.. ఈ వ్యవహారంలో బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ మాట్లాడుతూ విగ్రహం కూలిన ఘటనకు సంబంధించిన వివరాలు తెలియవన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని సింధుదుర్గ్ జిల్లా మంత్రి తెలిపారు. అదే ప్రదేశంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.