చండీగఢ్: ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత ‘ఫ్రూటీ’ తాగాడు. వెంటనే అతడికి వాంతులు మొదలయ్యాయి. తీవ్ర కడుపునొప్పితో బాధపడిన ఆ వ్యక్తి ఆరోగ్యం వేగంగా క్షీణించింది. పలు ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మరణించాడు. (man dies after consuming Frooti) హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. హనుమాన్ నగర్ ప్రాంతంలో నివసించే 33 ఏళ్ల అంకుష్, గురువారం రాత్రి ఉపవాసం ఆచరించాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ‘ఫ్రూటీ’ తాగాడు.
కాగా, ఆ పానీయం తాగిన వెంటనే అంకుష్‌కు వాంతులు మొదలయ్యాయి. అలాగే తీవ్రమైన కడుపు నొప్పితో అతడు బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అంకుష్ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఫరీదాబాద్‌లోని బాద్షా ఖాన్ సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడకు తరలించగా మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
మరోవైపు కుటుంబ సభ్యులు మరో ఆసుపత్రికి తరలిస్తుండగా అంకుష్ పరిస్థితి మరింత విషమించింది. మార్గమధ్యలోనే అతడు మరణించాడు. సర్వోదయ ఆసుపత్రికి తరలించినప్పటికే అంకుష్ మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అంకుష్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అతడి మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీస్ అధికారి వెల్లడించారు.