దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి పైగా బాలలు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ శాఖ పేర్కొంది. వారిలో సగం మందికిపైగా దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయని ఆర్టీఐ పిటిషన్‌కు ఇచ్చిన రిప్లయిలో వెల్లడించింది. కరోనా మహమ్మారి వల్ల నిరుపేద కుటుంబాల్లో ఆరోగ్యం, పౌష్టికాహార సంక్షోభం మరింత పెరిగి ఉండొచ్చునని తెలిపింది.
గత నెల 14 నాటికి 17,76,902 మంది చిన్నారులు తీవ్రంగా, 15,46,420 మంది మోస్తరుగా పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ నివేదిక పేర్కొంది. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 33,23,322 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించింది. గతేడాది నవంబర్ నుంచి గత నెల 14 వరకు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్న బాలలు 91 శాతం పెరిగారు. తీవ్రంగా పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్న వారు గతేడాది నవంబర్‌లో 9.27,606 మంది ఉంటే, ఇప్పుడది17.76 లక్షలకు చేరింది. పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా రియల్‌టైమ్‌లో ఈ డేటా సేకరించినట్లు కేంద్రం వివరించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 4,58, 788 మంది, బీహార్‌లో 1,52,083 మంది, గుజరాత్లో 1,62,364 మంది బాలలు తీవ్ర పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తం మహారాష్ట్రలో 6,16,772 మంది, బీహార్‌లో 4,75,824, గుజరాత్లో 3,20,824 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. కరోనా మహమ్మారితోనే ఈ మార్పులు సంభవించాయని చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్‌వై) సీఈవో పూజా మర్వాహా చెప్పారు.