Missing Childhoods | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ర్టాల్లో కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నది. ఇందులో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీయ పిల్లల దినోత్సం సందర్భంగా (మే 25న) గురువారం చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్ధ (క్రై) ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది.
‘మిస్సింగ్ చైల్డ్హుడ్స్’ పేరిట విడుదలైన ఈ బుక్‌లెట్‌లో వివిధ రాష్ర్టాల్లో ప్రతిరోజు తప్పిపోతున్న పిల్లల కేసుల గణాంకాలను పేర్కొన్నది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డాటా ప్రకారం మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ప్రతిరోజూ 31 మంది పిల్లలు గల్లంతవుతున్నారు. అందులో 81 శాతం బాలికలున్నారు. కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ఈ రాష్ట్రంలో ప్రతిఏటా పెరుగుతున్నది. 2021లో మొత్తం 11,607 మంది పిల్లలు కనిపించకుండా పోయారు. అందులో 9,407 మంది బాలికలే ఉన్నారని తేలింది.
2020లో 7,230 మంది బాలికలు తప్పిపోగా, మరుసటి ఏడాది 2021లో ఆ సంఖ్య 9407కు చేరుకుంది. బాలికల మిస్సింగ్ కేసులు 30.11 శాతం పెరిగాయి. కిడ్నాపులు, బలవంతపు వివాహాలు, దీర్ఘకాల మానసిక- సామాజిక పరిస్థితులు, విరక్తి, నిరంతర అవమానాలు, వేధింపులు, చదువు ఆగిపోవటం, బహిష్కరణలు వంటివి మిస్సింగ్‌కు కారణాలుగా ఉన్నాయని బుక్‌లెట్‌లో తెలిపారు.