కోల్కతా, మే 22: కోల్కతా సమీపంలోని ఓ అక్రమ బాణసంచా యూనిట్లో ఆదివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన పదేండ్ల బాలిక, పాప తల్లి, అమ్మమ్మ మరణించారు. ఈ వారంలో ఈ తరహా పేలుడు సంభవించడం ఇది రెండోసారి. కనీసం 30 మంది అక్రమంగా బజ్ బజ్, నంగి, మహేశ్తలా ప్రాంతాల్లో బాణసంచా యూనిట్లను నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆదివారం, సోమవారం దాడులు జరిపారు. 20 వేల కిలోల మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు సోమవారం బీర్భూమ్ జిల్లాలోని తృణమూల్ కాంగ్రెస్ పంచాయత్ సభ్యుడు షేక్ షరీఫ్ ఇంట్లో పేలుడు సంభవించి పైకప్పు, మెట్లు కూలిపోయాయి. నాటు బాంబులు పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.