LoC | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. పాకిస్తాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రజలను పాక్ బలిగొందని భారత సైన్యం తెలిపింది. దీనికి బదులు తీర్చుకుంటామని భారత్ పేర్కొంది.
భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించి, మిస్సైళ్లతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. మొత్తం తొమ్మిది స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేపట్టింది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి అర్ధరాత్రి భారత సైన్యం ఎక్స్‌లో పోస్టు చేసింది.