బెంగళూరు, అక్టోబర్ 22: పోలీస్ ఇన్ఫార్మర్లమని చెప్పి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురు వ్యక్తులు ఒక మహిళను బెదిరించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. మదనాయకనహళ్లిలోని ఒక అద్దె ఇంటిలో ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాధితురాలి ఇంట్లోకి మంగళవారం రాత్రి 9.15 గంటలకు ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు.
ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని, వ్యభిచారం చేస్తున్నారని బెదిరించారు. తర్వాత కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించారు. ఇంట్లోని వ్యక్తిని కట్టేసి మహిళను ఇంకో గదిలోకి తీసుకుపోయి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఇంట్లోని 25 వేల నగదు, రెండు సెల్ఫోన్లను అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధితులను చికిత్స కోసం దవాఖానకు తరలించారు.