Wayanad Landslides | వయనాడ్, జూలై 31: ప్రకృతి మిగిల్చిన విలయంతో వయనాడ్ మరుభూమిగా మారిపోయింది. ఎటుచూసినా శిథిలాలతో విషాదదృశ్యాన్ని తలపిస్తున్నది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. చలియార్ నదిలో శవాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. వందలాది ఇండ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ దొరకడం లేదు. తమవారి జాడ తెలియక వారి ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. తమ కండ్ల ముందే కుటుంబసభ్యులు వరదలో కొట్టుకుపోయారని చెప్తూ కన్నీటిపర్యంతమవుతున్నారు. అనేక ఇండ్లు బురదలో మునిగిపోయాయి. ముండక్కై, చూరల్మల, మెప్పడిలో ఎటుచూసినా హృదయవిదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి.
కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటివరకు 270 మృతదేహాలు లభ్యమయ్యాయి. చలియార్ నదిలో కొట్టుకువచ్చిన 83 మృతదేహాలను బయటకు తీశారు. 166 మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ పూర్తికాగా, 32 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఇప్పటికీ అధికారికంగా 200 మంది ఆచూకీ దొరకడం లేదు. 191 మంది తీవ్ర గాయాలతో వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం 45 సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి 3,069 మందిని తరలించింది. ఇప్పటికే విరిగిపడ్డ కొండచరియలను చాలావరకు తొలగించలేదు. అనేక ఇండ్లలోకి సహాయక సిబ్బంది చేరుకోలేదు. దాదాపు 500 ఇండ్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో, మృతులు, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.
ముండక్కై, చూరల్మల, మెప్పడిలో మంగళవారం రాత్రి నిలిచిపోయిన సహాయక చర్యలు బుధవారం వేగం పుంజుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముండక్కై, చూరల్మల మధ్య వంతెన కూలిపోవడం సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఆర్మీ సిబ్బంది తాత్కాలిక వంతెనను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు. చిన్న వరద ప్రవాహాల మీదుగా అప్పటికప్పుడు కూలిన చెట్లు, ఇసుక బస్తాలతో తాత్కాలిక వంతెనలు వేసి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. ఇక, మెప్పడిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిబిరాల్లోని బాధితులకు సేవలందిస్తున్నారు.
చూరల్మల గ్రామంలో ఆచూకీ లభించని నీతూ జోజో తన ప్రాణాలు కాపాడుకునేందుకు చివరి నిమిషం వరకు చేసిన ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. ఆమె స్థానిక మెడికల్ కాలేజీలో పనిచేస్తారు. తన ఇంట్లోకి వరద నీరు చేరడంతో నిద్ర లేచిన ఆమె ఆందోళన చెందారు. తాను పని చేసే కాలేజీకి మంగళవారం తెల్లవారు జామున 1.30 నుంచి 2.30 మధ్య మూడుసార్లు ఫోన్ చేశారు. ‘మా ఇల్లు మొత్తం నీటితో నిండిపోయింది. మమ్మల్ని కాపాడేందుకు ఎవరినైనా రమ్మని చెప్పండి. లేకపోతే మేము కొట్టుకుపోతాం’ అని ఆమె వేడుకున్నారు. చూరల్మలకు వెళ్లే వంతెన తెగిపోవడంతో ఆమె స్నేహితులు, కాలేజీ సిబ్బంది నిస్సహాయంగా మిగిలిపోయారు. ఆమెకు 2.50కి తిరిగి ఫోన్ చేసేటప్పటికీ నీతూ ఆచూకీ గల్లంతైంది. నీతూ ఇంటి వంటగది కొట్టుకుపోయింది. ఆమె కుటుంబం మాత్రం ప్రాణాలతో బయటపడింది.
ముండక్కైలో గతంలోనూ కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు జరిగాయి. 1984 జూలై 1న పెద్దఎత్తున ఈ పట్టణంపై కొండచరియలు విరుచుకుపడగా 14 మంది మరణించారు. అప్పుడు కూడా పలువురి మృతదేహాలు చలియార్ నదిలో లభ్యమయ్యాయి. 2019 ఆగస్టు 8న భారీ వర్షాలు కురవడంతో మరోసారి కొండచరియలు పట్టణంపై విరుచుకుపడగా 22 మంది మరణించారు.
కొండచరియలు విరిగిపడటం, వరద ముంపునకు గురికావడంతో ముండక్కై, చూరల్మల పట్టణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయి. ఇంకొన్ని ఇండ్లు వరదప్రవాహంలో కొట్టుకుపోయాయి. రెండు పట్టణాలు మొత్తం బురదతో నిండిపోయాయి. దగ్గరలో జలపాతాలు ఉండటంతో పర్యాటకులతో నిత్యం కళకళలాడే ఈ ప్రాంతాలు ఇప్పుడు ఘోస్ట్ టౌన్లను తలపిస్తున్నాయి. ఈ పట్టణాల్లోని పలు ప్రాంతాల ఆనవాళ్లే కనిపించడం లేదు.
కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని జూలై 23, 24, 25, 26 తేదీల్లో కేంద్రం హెచ్చరించింది. అయినా కేరళ ప్రభుత్వం అప్రమత్తం కాకుండా అసలు ఏం చేసింది ? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదు ? తరలిస్తే ఇప్పుడు ఎందుకు మరణించారు ?ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
115-204 మి.మీ. మధ్య వర్షపాతం కురుస్తుందనే కేంద్రం చెప్పింది. కానీ 572 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడ్డ తర్వాతనే రెడ్ అలర్ట్ జారీ చేసింది. నదులకు సంబంధించి సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేయలేదు. కొండచరియలు విరిగిపడే చిన్నపాటి ఘటనలు జరగొచ్చని మాత్రమే జీఎస్ఐ గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. నిందలు వేసుకునేందుకు ఇది సమయం కాదు.
సహాయక సిబ్బంది కూలిపోయిన ఇండ్ల శిథిలాలను, ఇండ్లను ముంచేసిన బురదను తొలగించినప్పుడు మనస్సును కలిచివేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కూర్చున్నట్టుగా కొందరి మృతదేహాలు లభ్యం కాగా, మరికొందరు మంచంపై నిద్రించినట్టుగానే మరణించారు. కొందరు వరద నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు చివరి క్షణం వరకు తీవ్రంగా ప్రయత్నించినట్టు కనిపిస్తున్నది. ఒకరినొకరు గట్టిగా హత్తుకున్న స్థితిలో నలుగురి మృతదేహాలు లభించాయి.
చూరల్మలలో ఓ కుటుంబాన్ని ఇంట్లో పెంచుకున్న ఆవు కాపాడింది. సోమవారం అర్ధరాత్రి వినోద్ ఇంటి పశువులకొట్టంలోని ఆవు అరవడం ప్రారంభించింది. వినోద్ వెళ్లి చూడగా మొత్తం వరదనీరు చుట్టుముట్టింది. దీంతో తన కుటుంబసభ్యులు ముగ్గురిని నిద్రలేపి కొండపైన సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. మెప్పడి గ్రామంలోని తన అత్తవారింటికి ఫోన్ చేయడంతో వారూ సురక్షిత ప్రాంతానికి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు.
కొన్ని కుటుంబాల్లో ఒక్కరు కూడా మిగలకపోవడంతో వారి అంత్యక్రియలను వాలంటీర్లే పూర్తి చేస్తున్నారు. మెప్పడిలోని జుమా మసీదులో 30 మృతదేహాల అంత్యక్రియలను తామే జరిపినట్టు మసీదు కమిటీ ఉపాధ్యక్షుడు ముస్తఫ మౌలవి తెలిపారు. ముండక్కైలోని ఓ మసీదులో సామూహికంగా అంత్యక్రియలు జరిగాయి. ఇప్పటికీ చాలామంది మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఎవరూ లేకపోవడంతో మార్చురీలు నిండిపోతున్నాయి.
కేరళలో ఏడు నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరిగిందని సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించింది. ఏడు నదులకు సంబంధించి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో ఐదు నదులకు సంబంధించి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నదుల పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.