ముంబై, సెప్టెంబర్ 3: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ-బాంబేలో ఈ ఏడాది జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఐఐటీ విద్యార్థులకు నూరు శాతం ఉద్యోగావకాశాలు వస్తాయన్న చాలామంది అంచనాను తలకిందులు చేస్తూ ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 75 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయి. గత ఏడాది ఇది 84 శాతం ఉంది. అలాగే కనిష్ఠ వార్షిక వేతనం గత ఏడాది రూ.6 లక్షలు ఉండగా, ఈ ఏడాది అది రూ.4 లక్షలకు దిగజారింది. అయితే సగటు వార్షిక వేతన ప్యాకేజ్ 7.7 శాతం పెరిగి రూ.23.5 లక్షలకు చేరుకుంది. ప్రాంగణ నియామకాలకు హాజరైన వారిలో 75 శాతం మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. గత ఏడాది ఇక్కడకు 324 కంపెనీలు రాగా, ఈసారి 364 కంపెనీలు పాల్గొన్నాయి. అయితే అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లలో ఐఐటీ బాంబే మంచి పెరుగుదల సాధించింది. మొత్తం 78 ఆఫర్లను విద్యార్థులు అంగీకరించగా, అందులో 22 ఉద్యోగాలకు కోటి రూపాయలకు పైగానే వార్షిక వేతనం ఉంది.