న్యూఢిల్లీ: విదేశీ విద్యార్థుల కోసం దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో 25% వరకు సూపర్‌న్యూమరరీ సీట్లను సృష్టించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించనున్నది. అంతేకాకుండా ఈ విద్యాసంస్థల్లో విదేశీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రవేశాలను పొందేందుకు వీలుకల్పించనున్నది. దేశంలోని అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్‌గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్‌లను అంతర్జాతీయకరణ చేసేందుకు గతవారం నిర్వహించిన సమావేశంలో యూజీసీ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థలకు మంజూరు చేసిన మొత్తం సీట్లకు అదనంగా సూపర్‌న్యూమరరీ సీట్లను సృష్టిస్తారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఆయా ఉన్నత విద్యాసంస్థలే తీసుకొంటాయి. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ సంస్థలు జారీచేసే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థలు ఈ నిర్ణయాలను తీసుకొంటాయని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వివరించారు.