తిరువనంతపురం: కుటుంబ ఘర్షణలో గాయపడిన ఒక వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గాయానికి కట్టుకడుతున్న వైద్యురాలిని ఆ వ్యక్తి కత్తెరతో పొడిచి చంపాడు (Kerala Doctor Stabbed). కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తనను కొట్టి చంపుతున్నారని, తనను కాపాడాలంటూ కొట్టారక్కర ప్రాంత పోలీసులకు బుధవారం ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. కుటుంబ గొడవలో కాలికి గాయమైన సందీప్‌ను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న 23 ఏళ్ల డాక్టర్ వందనా దాస్, అతడి కాలి గాయానికి కట్టువేయసాగింది. అయితే సందీప్ ఉన్నట్టుండి ఆ వైద్యురాలిపై కత్తెర, సర్జరీ బ్లేడ్‌తో దాడి చేశాడు. దీంతో కాపాడాలని అరుస్తూ డాక్టర్ గది నుంచి ఆమె బయటకు పరుగులు తీసింది. వెంబడించిన సందీప్, డాక్టర్ వందనాను కత్తెరతో పొడిచాడు.
డాక్టర్ గది బయట ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ సందీప్‌ను నిలువరించలేకపోయారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. అతికష్టం మీద అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. స్కూల్ టీచర్ అయిన సందీప్ సస్పెన్షన్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యురాలిపై దాడి సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. అయితే డాక్టర్ వందనాపై సందీప్ ఎందుకు ఆగ్రహించి దాడి చేశాడో అన్నది తెలియదని అన్నారు.
కాగా, తీవ్రంగా గాయపడిన డాక్టర్ వందనాను తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ సంఘటన కేరళలో కలకలం రేపింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ దాడిని ఖండించడంతోపాటు నిరసనకు పిలుపునిచ్చింది. కేరళ సీఎం విజయన్ కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షాకింగ్తోపాటు చాలా బాధాకరమని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.
మరోవైపు వ్యక్తి దాడిలో వైద్యురాలు మరణించిన ఈ సంఘటన కేరళలో రాజకీయంగా దుమారం రేపింది. డాక్టర్ వందన హౌస్ సర్జన్ అని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆమెకు అనుభవం లేకపోవడంతో దాడి జరిగినప్పుడు భయపడిందని మీడియాతో అన్నారు. కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకర్ దీనిపై మండిపడ్డారు. అనుభవం లేని వైద్యురాలని ఆరోగ్య మంత్రి పేర్కొనడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ‘మాదకద్రవ్యాలు, మద్యానికి బానిసైన వ్యక్తి దాడిని ఎదుర్కోవడం లేదా రక్షించుకోలేకపోవడంలో ఆ డాక్టర్‌కు అనుభవం లేదని మంత్రి అర్థమా?’ అని నిలదీశారు.